పాత్రికేయుడి నుంచి ప్రధాని వరకు – వాజ్‌పేయీ

‘‘నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది.. నీళ్లలోంచి విద్యుత్తు సెగ పుడుతుంది.. ఈ దానవ లోకంలో ఎన్నటికైనా మానవులని పిలువదగిన తెగ పుడుతుంది’’ అంటారు దాశరథి. వంగి వంగి సలాములు చేయడం, వందిమాగధుల కంటే హీనంగా స్త్రోత్ర పాఠాలు చదవడమే రాజకీయ ఎదుగుదలకు కొలమానంగా మారిన కాలంలో నిటారుగా నిలుచుని సూటిగా సత్యం నినదించి ఎదిగిన నేత వాజ్‌పేయీ. ‘బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజు నా జీవితంలోనే అత్యంత దుర్దినం’ అని సొంత పార్టీపైనే పదును విమర్శలు సంధించాలంటే కావలసింది రాజకీయ పరిపూర్ణత… ప్రజాసేవా నిబద్ధత. వాజ్‌పేయీలో అవి పుష్కలం.

అది 1957… లోక్‌సభ వెనుక బెంచీలో కూర్చుని ఓ యువ ఎంపీ సభా కార్యకలాపాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. మధ్య మధ్యలో నోట్సు రాసుకుంటున్నారు. అవకాశం చిక్కినప్పుడు లేచి హిందీలో చక్కటి ప్రసంగాలు చేస్తున్నారు. ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ సభలో ఆ యువకుడి ప్రతిభా సామర్థ్యాలను దగ్గరనుంచి గమనించారు. ‘‘ఈ కుర్రాడికి రాజకీయాల్లో మంచి భవిష్యత్తు ఉంది. ప్రధాని కాగల సత్తా ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు’’ అని ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. ఐదు దశాబ్దాల క్రితమే నెహ్రూ కితాబులందుకున్న ఆ యువకుడే అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. నెహ్రూ భవిష్యవాణి ఫలించింది. క్రమశిక్షణ, విలువలే పెట్టుబడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 1996, 1998, 1999లలో మూడు పర్యాయాలు ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఇందిరాగాంధీ తరవాత ప్రధాని పదవిలో ఉండి ఎన్నికల్లో పార్టీని గెలిపించిన ఏకైక నాయకుడిగా వాజ్‌పేయీ ఖ్యాతినార్జించారు. ఐదు దశాబ్దాలకు పైబడిన రాజకీయ జీవితంలో ప్రతిపక్ష నాయకుడిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా అత్యున్నత పదవుల్ని అలంకరించినా మచ్చుకైనా అవినీతి మకిలి సోకని అరుదైన నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ లక్షణాలే వాజ్‌పేయీని భారత రాజకీయాల్లో విశిష్ట నాయకుడిగా నిలిపాయి.

తండ్రీ కొడుకులు ఒకేసారి విద్యాభ్యాసం
మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో వాజ్‌పేయీ 1924 డిసెంబరు 25న జన్మించారు. తండ్రి కృష్ణ బిహారీ వాజ్‌పేయీ స్కూలు టీచరు. తల్లి కృష్ణాదేవి. ఈ దంపతులకు మొత్తం ఏడుగురు సంతానం. వాజ్‌పేయీ పాఠశాల విద్యాభ్యాసమంతా బింద్‌, గ్వాలియర్‌లలోనే జరిగింది. గ్వాలియర్‌ క్వీన్‌ విక్టోరియా కళాశాల, కాన్పూర్‌ డి.ఎ.వి. కాలేజీల్లో డిగ్రీ పూర్తి చేశారు. కాన్పూర్‌ విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ. చదివారు. అదే సమయంలో వాజ్‌పేయీ తండ్రి కృష్ణ బిహారీ న్యాయశాస్త్ర కోర్సు తీసుకున్నారు. తండ్రీ కొడుకులు కాన్పూర్‌ హాస్టల్‌లో ఉంటూ ఒకేసారి విద్యాభ్యాసం చేయడం విశేషం. దేశ విభజన అల్లర్లకు కలత చెందిన వాజ్‌పేయీ లా కోర్సు డిగ్రీ పూర్తి చేయకుండా మధ్యలోనే చదువు మానేశారు. మొదటినుంచీ సామాజిక సమస్యలపట్ల ఆయనది సున్నిత మనస్తత్వమే.

చిన్నవయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పట్ల ఆకర్షితులయ్యారాయన. కవిగా, వక్తగా, రచయితగా పేరు పొందారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌. వైపు వెళ్లకపోతే తాను కమ్యూనిస్టునయ్యేవాడినని వాజ్‌పేయీ తరచూ చెప్పేవారు. విద్యార్థి దశనుంచే ఆయన మంచి ఉపన్యాసకుడిగా పేరు సంపాదించారు. అలహాబాద్‌ విశ్వవిద్యాలయంలో చదువుకునేటప్పుడే గ్వాలియర్‌లో వక్తృత్వ పోటీలకు వాజ్‌పేయీ హాజరయ్యారు. పోటీలో పాల్గొనేందుకు ముందుగా పేరు ఇచ్చారు. కానీ సమావేశ మందిరానికి వెళ్లేసరికి పోటీ సమయం దాటిపోయింది. దాంతో పోటీ ముగిసినట్లు ప్రకటించిన నిర్వాహకులు వాజ్‌పేయీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. కానీ న్యాయనిర్ణేతల్లో ఒకరైన హరివంశరాయ్‌ బచ్చన్‌ జోక్యం చేసుకొని ఆ యువకుడికి అవకాశం ఇద్దామన్నారు. అందివచ్చిన అవకాశాన్ని వాజ్‌పేయీ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు. ఆయన వాగ్దాటి సభికులను మంత్రముగ్ధం చేసింది. బహుమతి వాజ్‌పేయీనే వరించింది. ఆయన క్రమశిక్షణ, చిత్తశుద్ధి జనసంఘ్‌ నాయకుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీని అమితంగా ఆకట్టుకున్నాయి. వాజ్‌పేయీని తన కార్యదర్శిగా నియమించుకున్నారు. పార్టీలో వాజ్‌పేయీ క్రమంగా ఒక్కొక్క మెట్టే ఎదగసాగారు. శ్యాంప్రసాద్‌ ముఖర్జీ మరణానంతరం వాజ్‌పేయీ జనసంఘ్‌లో కీలకనేతగా మారారు.

లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసినప్పుడు వాజ్‌పేయీ ఓడిపోయారు. అందుకు ఆయన ఏమాత్రం కుంగిపోలేదు. ఓట్లు లెక్కించే నాటి సాయంత్రం మిత్రులతో కలిసి సరదాగా సినిమాకు వెళ్ళారు. వాజ్‌పేయీ 1957లో ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. జనసంఘ్‌ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకునిగా, జనతాపార్టీ వ్యవస్థాపకుడిగా, భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, భాజపా పార్లమెంటరీ పార్టీ నేతగా రాజకీయాల్లో వాజ్‌పేయీ పోషించని పాత్రలేదు.

పార్లమెంటేరియన్‌గా…
హుందాతనానికి వాజ్‌పేయీ పెట్టింది పేరు. పార్లమెంటు సభ్యుడిగా ఆయన వ్యవహారశైలి ప్రత్యర్థులను సైతం కట్టిపడేసేది. వాజ్‌పేయీ తిరుగులేని వక్త. మాటలకు మత్తుజల్లి ఆయన చేసే ప్రసంగాలు శ్రోతల్ని ఉర్రూతలూగించేవి. మధ్యమధ్యలో హాస్యం మేళవిస్తూ, వ్యంగ్యోక్తులు విసురుతూ ఆయన చేసే ఉపన్యాసాలు జనరంజకంగా ఉండేవి. 1962లో చైనా, 1965లో పాకిస్థాన్‌తో యుద్ధాలు తలెత్తినప్పుడు సర్కారుకు సంపూర్ణ అండదండలందించారాయన. 1965లో నాటి ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి కాశ్మీర్‌ విషయంలో భారత్‌ వాదనను వినిపించేందుకు వాజ్‌పేయీని ఆఫ్రికా దేశాలకు దూతగా పంపించారు. పాకిస్థాన్‌ను యుద్ధంలో ఓడించి, 1971లో బంగ్లాదేశ్‌ అవతరణకు చేయూతగా నిలిచినప్పుడు… భారత విజయసారథి ఇందిరాగాంధీని ఆయన అపర దుర్గగా కీర్తించారు. 1974 పోఖ్రాన్‌ అణుపరీక్షల్నివాజ్‌పేయీ గట్టిగా సమర్థించారు. ఆ రకంగా ప్రధానిని ఓ విపక్షనేత ప్రశంసించడమన్నది దేశ రాజకీయాల్లో అరుదైన ఘట్టం. 1957నుంచి మొత్తం పదిసార్లు పార్లమెంటు సభ్యుడిగా పలురాష్ట్రాల నుంచి వాజ్‌పేయీ విజయం సాధించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 1957లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌ అనంత శయనం అయ్యంగార్‌ మాట్లాడుతూ హిందీలో వాజ్‌పేయీ, ఆంగ్లంలో ప్రొఫెసర్‌ హిరేన్‌ ముఖర్జీ బ్రహ్మాండమైన వక్తలని కితాబిచ్చారు. అవినీతి, కుంభకోణాలకు సంబంధించిన అంశాలను ఆయన తీక్షణంగా ఎండగట్టేవారు. ప్రజా సమస్యలపై ఆలోచనలు రేకెత్తించేలా పదునైన ప్రసంగాలు చేసేవారు.

ఇందిరాగాంధీ 1975లో దేశంలో అత్యయిక పరిస్థితిని విధించారు. ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా వాజ్‌పేయీ ఏ దశలోనూ మడమతిప్పకుండా పోరాడారు. అనంతరం జనతాపార్టీ ఆవిర్భావంలోనూ ఆయనది కీలక భూమిక. ఎమర్జెన్సీలో ఆయనను అరెస్టు చేశారు. సర్కారీ నియంతృత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్‌ నారాయణ్‌ చేపట్టిన రెండో స్వాతంత్య్ర పోరాటంలో వాజపేయి కీలక పాత్ర పోషించారు. మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలో 1977లో జనతా ప్రభుత్వం ఏర్పడినప్పుడు విదేశాంగ శాఖను వాజ్‌పేయీకి అప్పగించారు. విదేశాంగ సచివుడిగా ఆయనది విజయయాత్ర. చైనా, పాకిస్థాన్‌తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించేందుకు వాజ్‌పేయీ గణనీయమైన కృషి చేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారాయన. జనతాపార్టీ పతనానంతరం 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడగా వాజ్‌పేయీ దానికి తొలి అధ్యక్షుడయ్యారు.

అందరికీ ఆమోదయోగ్యుడు
సంప్రదాయంగా భాజపా ప్రబోధించే హిందూత్వ సిద్ధాంతాన్ని ఆవలపెట్టి గాంధేయ సామ్యవాద నినాదాన్ని భుజానికెత్తుకున్నారాయన. కానీ ఈ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వాజ్‌పేయీ విజయం సాధించలేకపోయారు. ఇందిర హత్యానంతరం 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా కేవలం రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే సాధించగలిగింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టాలని కోరుతూ సోమనాథ్‌ నుంచి 1990లో ఎల్‌.కె.అద్వానీ రథయాత్రను చేపట్టారు. దేశంలో విద్వేష వాతావరణానికి అంటుకట్టే ఆ యాత్రను విరమించుకోవాలని అద్వానీని వాజ్‌పేయీ అభ్యర్థించారు. బాబ్రీ మసీదు – రామజన్మభూమి వివాదాన్ని తీసుకెళ్లిన భాజపా ఎన్నికల్లో లాభపడింది. 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది. తన జీవితంలో అది అత్యంత విషాదకరమైన రోజు అని వాజ్‌పేయీ వ్యాఖ్యానించారు. తన అంతరంగ ఆవేదనను కవితగా అక్షరీకరించారు. అద్వానీ సారథ్యంలో చేపట్టిన హిందూత్వ ఉద్యమాలు భాజపాకు అధికారాన్ని సాధించిపెట్టాయి. కానీ ప్రధాని అభ్యర్థిగా ఎవరుండాలన్న విషయంలో మాత్రం ఉదారవాది అయిన వాజ్‌పేయే అందరికీ ఆమోదయోగ్యుడిగా నిలిచారు.

1996లో పదమూడు రోజుల ప్రభుత్వానంతరం 1998, 1999లలో వాజ్‌పేయీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2004 వరకూ 23 పార్టీలతో కూడిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి సంకీర్ణ సర్కారును ఆయన అత్యంత చాకచక్యంగా నిర్వహించారు. ప్రధానిగా వాజ్‌పేయీ సాధించిన విజయాలు ఆయన పాలన, వ్యవహార దక్షతలకు ప్రతీకగా నిలుస్తాయి. పాక్‌తో శాంతికోసం లాహోర్‌కు బస్సుయాత్ర చేయడం వాజ్‌పేయీ విజయాల్లో చెప్పుకోదగినది. కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ను మట్టికరిపించిన భారత సేనలకు ఆయన అందించిన స్ఫూర్తి విస్మరించలేనిది. భారత అణుపరీక్షలను వ్యతిరేకించిన అగ్రరాజ్యాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పుడు… తట్టుకొని నిలబడేలా దేశాన్ని సమాయత్తం చేసిన ఘనత వాజ్‌పేయీది.

క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో ఇరువురు ఉద్యమకారులకు వ్యతిరేకంగా వాజ్‌పేయీ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అంశాన్ని ఫ్రంట్‌లైన్‌ పత్రిక బహిర్గతం చేసింది. దాన్ని తొలుత ఖండించినా- తరవాత అన్యాపదేశంగానైనా వాజ్‌పేయీ అంగీకరించారు. ఆ సమయంలో వాజ్‌పేయీ ఇంటర్‌ చదువుతున్నారు. వయసులో మరీ చిన్నవాడైనందున వాజ్‌పేయీ చేసిన తప్పును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని భాజపా పేర్కొంది. రాష్ట్ర ధర్మ, పాంచజన్య పత్రికలకు ఆయన సంపాదకునిగా పనిచేశారు. సంకీర్ణ రాజకీయాలను సమగ్రంగా గ్రంథస్థం చేశారు. వాజ్‌పేయీ ప్రసంగాలు, కవితలు పుస్తకాలుగా వెలువడ్డాయి. భాజపా లాంటి పార్టీలో వాజ్‌పేయీ వంటి మంచి నేత ఉండాల్సిన వ్యక్తి కాదని పలువురు విశ్లేషకులు పేర్కొంటుంటారు. హిందూత్వ పార్టీలో ఆయన ఓ ఉదారవాది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *