కాశ్మీర్ చిచ్చు పెట్టి చలి కాచుకోవడానికి సిద్దమవుతున్న మోడీ షా…..?

కశ్మీర్‌ ఒక్కటే కాదు, ఈ ఏడాది కాలంలో ఇంకా అనేక అంశాలు ఉన్నట్టుండి రంగప్రవేశం చేస్తాయి. ఉద్రేకాల మధ్య అటా ఇటా అని ప్రశ్నిస్తాయి. అందరి దేశభక్తిని బోనులో నిలబెడతాయి. ఉన్నచోట జనం అనుభవిస్తున్న నిజమైన కష్టాలను మరుగు పరుస్తాయి.మన ఓట్లను మన మనస్సుల్లోనే రిగ్గింగ్‌చేస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, ఇట్లా చేయకూడదనే విలువ ఎవరికీ లేదు కాబట్టి. ఉచ్చం నీచం మంచి చెడూ ఏమీ లేవు కాబట్టి.

చిచ్చుతో చలికాచుకోవద్దు! #కె_శ్రీనివాస్
Srinivas Kandlakunta

ఆట మొదలయింది – అన్నాడు బిజెపికి వీరాభిమాని అయిన ఒక మిత్రుడు ఉత్సాహంగా. కశ్మీర్‌ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అతను ఆ మాట అన్నాడు. దేశంలో ఇప్పుడు మోదీ ప్రభుత్వం మీద లేస్తున్న గొంతులన్నిటికీ సమాధానం ఈ ఆటలోనే ఉంటుందని అతను ధీమాగా చెప్పాడు.

రాజకీయాలంటేనే ఎత్తులు పై ఎత్తులు అని జనసామాన్యం అనుకుంటారు. ఎన్నికలు సమీపిస్తున్నాయంటే, అధికారం నిలుపుకోవడానికి ఒక పక్షం, అధికారం చేజిక్కించుకోవడానికి మరో పక్షం వ్యూహరచన చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే. చేసిన పనులను చెప్పుకోవడం, కొత్త ఆశలు చూపించి ఆకట్టుకోవడం– వంటి సాధారణ ఎత్తుగడలతో పాటు, కులం, మతం వంటి అంశాల రీత్యా ఓటర్ల సంఖ్యను బేరీజు వేసుకుని చేసే సామాజిక ఇంజనీరింగ్‌ చాతుర్యం, తమవారి ఓట్లను సమీకరించుకోవడంతో పాటు, ఎదుటి ఓట్లను చీల్చడం– వంటివి ఈ పాటికే స్థిరపడిపోయి, సహజమనిపించే స్థాయికి ఆమోదం పొందాయి. అర్థవంతమైన పాలన అందించడం కంటె, బూత్‌ స్థాయి ఓటర్ల నిర్వహణ మీద దృష్టి పెట్టడమే ప్రయోజనకరమూ, ప్రయోజకత్వమూ అని పార్టీలు విశ్వసిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని సీరియస్‌గా తీసుకునేవారికి ఇవి ఎంతటి అపచారంగా అనిపించినా, అత్యధిక ప్రజానీకానికి అధికార ప్రక్రియలకు ఉన్న దూరం రీత్యా, వాటి ప్రభావాలు, పర్యవసానాలూ పూర్తి దుర్భరస్థాయికి చేరుకోలేదు. కానీ, అంతకంటె ప్రమాదకర క్రీడలు ఎన్నికల పోరాటంలోకి ప్రధాన వ్యూహాంశాలుగా ముందుకు రావడం మాత్రం భయాందోళనలు కలిగించగలిగేదే. 2019 ఎన్నికల కోసం ప్రమాదరంగస్థలం నిర్మితమవుతోందా?

భావోద్వేగ రాజకీయాలు – అని ఇప్పుడు కొంత అవ్యాప్తి అతివ్యాప్తి దోషాలతో పిలుచుకుంటున్న ధోరణి కొత్తగా వచ్చినదేమీ కాదు. ఒక నాయకురాలు లేదా నాయకుడు చనిపోతే, వారి వారసులపైనో, పార్టీ పైనో సానుభూతి ఓట్ల రూపం తీసుకోవడం మనకు తెలిసిందే. ఇందిర హత్య తరువాత జరిగిన 1984 ఎన్నికలు ఆ సానుభూతి తీవ్రతకు ఒక సూచిక. 1991లో రెండు విడతల ఎన్నికల మధ్యలో రాజీవ్‌ గాంధీ హత్యకు గురి అయితే, మునుపటి, తరువాతి దశల ఫలితాల మధ్య ఉన్న నిర్ణయాత్మకమైన తేడా సానుభూతి ఓట్ల ప్రభావానికి నికార్సయిన ఉదాహరణ. రాజీవ్‌ హత్యకు ముందు జరిగిన పోలింగ్‌లో హిందూత్వ ఉద్రేకాలు ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేస్తే, ఆ ఉద్రేకాలను పూర్వపక్షం చేసే సానుభూతి పవనాలు హత్యానంతర దశ ఓటింగ్‌ సరళిని ప్రభావితం చేశాయి. మతతత్వ రాజకీయాలను కూడా భావోద్వేగ రాజకీయాల కిందికి పరిగణిస్తున్నారు కానీ, కొంత వ్యత్యాసం ఉన్నది.

రామజన్మభూమి సాధన కోసం1980ల మధ్యలో భారతీయ జనతాపార్టీ, విశ్వహిందూ పరిషత్‌ ప్రారంభించిన ప్రయత్నం, హిందూమతస్థులను భావనాత్మకంగా ఏకం చేయడానికి ఉద్దేశించినదే అయినప్పటికీ, ఇందులో సానుభూతి వంటి సాత్వికమయిన వ్యక్తీకరణ కాక, మిలిటెన్సీ, ‘ఇతరుల‘ను లక్ష్యంగా పెట్టుకోవడం ఇమిడి ఉన్నాయి. కుల, ప్రాంతీయ వాద ఉద్యమాలలో భావోద్వేగ అంశాలు, నినాదాలు ఉన్నప్పటికీ, వెనుకబాటుతనం, వివక్ష, సమానావకాశాల ఆకాంక్ష వంటి వాస్తవిక అంశాలు ప్రాతిపదికలుగా ఉన్నాయి.

దేశభక్తి అన్నిటి కంటె బలమైన భావోద్వేగం. దేశభక్తిని అంతర్గత రాజకీయాలలో ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవడం కాంగ్రెస్‌ కూడా చేసింది. 1971 ఎన్నికల నాటికి బంగ్లాదేశ్‌ యుద్ధం ఇంకా జరగలేదు కానీ, నాటికే తీవ్రదశకు చేరుకున్న తూర్పు బెంగాల్‌ విమోచనోద్యమం, ఇందిరాగాంధీ పాకిస్థాన్‌పై ప్రదర్శించిన నిష్కర్ష వైఖరి ఆమెను విజయేందిర చేశాయి. తరువాతి కాలంలో ఆమె నియంత కావడానికి కావలసిన జనాకర్షణని బంగ్లాదేశ్‌ యుద్ధం సమకూర్చింది. ఆరోజులలో ఆమె తనపై రాజకీయ పోరాటం చేస్తున్నవారినందరినీ విదేశీ శక్తులుగా, సిఐఎ ఏజెంట్లుగా నిందించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వారి రాజకీయ పూర్వీకులు కూడా నాడు అమెరికా ఏజెంట్లుగా ముద్రపడినవారే. ఆమె విరివిగా ఉపయోగించిన ‘విదేశీహస్తం’ అన్న మాట, హాస్యాస్పద స్థాయికి చేరింది. 1980లో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ఇందిరాగాంధీ, పంజాబ్‌ ఉద్యమాన్ని, ప్రాంతీయ శక్తుల అవతరణను దృష్టిలో పెట్టుకుని, దేశసమగ్రత, సమైక్యత అన్న జమిలినినాదాన్ని ఆశ్రయుంచారు.

కానీ, ఇందిర తన పాలనాక్రమంలో దేశభక్తిని, సమైక్యతను వల్లెవేశారు తప్ప, ప్రత్యక్షంగా ఎన్నికల కోసమని యుద్ధాలు చేయలేదు, స్వదేశీకల్లోలాలను ఎన్నికల దృష్టితో ఉపయోగించుకోలేదు. కానీ, ఎన్నికల సమయంలో దేశభద్రత ఒక కీలకాంశంగా మారినప్పుడు ఓటింగ్‌ తీరు ఎట్లా ఉంటుందో కార్గిల్‌ యుద్ధం రుజువు చేసింది. మంద్రస్థాయిలో దీర్ఘకాలం జరిగిన కార్గిల్‌ ఘర్షణ వెనుక కూడా రాజకీయాలు పనిచేశాయని విమర్శించేవాళ్లు ఉండవచ్చును కానీ, ఆ నాటి ఉద్వేగపూరిత వాతావరణం మొదటి ఎన్‌డిఎ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగడానికి కావలసిన రాజకీయ బలాన్ని ఇచ్చింది. వాజపేయికి ఉండిన సంయమనం కానీ, రాజనీతిజ్ఞత కానీ కొరవడ్డాయని స్వపక్షీయుల విమర్శలనే ఎదుర్కొంటున్న మోదీ ప్రభుత్వం 2019లో మరోవిడత విజయానికి దేశభక్తి అనే ఉద్వేగాన్ని ఉపయోగించుకుంటుందా? భారతీయ జనతాపార్టీ శిబిరం విశ్వసించే సాంస్కృతిక జాతీయవాదం మతాన్ని, దేశభక్తిని మిళితం చేస్తున్నది. అటువంటి మిశ్రమాన్ని ఒక సాధనంగా జాతీయస్థాయిలో ఉపయోగించుకోగలిగితే అది పైకి ‘హిందూత్వ’ వాదంగా కనిపించదు. ఎన్నికలు ఇంకో ఏడాది మాత్రమే ఉండగా, కశ్మీర్‌ విషయంలో బిజెపి తీసుకున్న నిర్ణయం వెనుక రాజకీయ పరిగణన ఉన్నదా? ఆరోపణ కాదు కదా, అటువంటి ఊహను కూడా అక్షరబద్ధం చేయడానికి సంకోచించే మీడియా, ఇప్పుడు బాహాటంగానే అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. 2019లో ఎన్నికలలో గెలుపోటములకు ఉన్న ప్రాధాన్యం రీత్యా, ప్రతిపక్షానికే కాక అధికారపక్షానికి కూడా ఇది జీవన్మరణ సందర్భం.

2009–10 నుంచి తిరిగి మొదలయిన కశ్మీర్‌ ఆందోళనను అప్పటి యుపిఎ ప్రభుత్వం తనదైన సరళిలో నియంత్రిస్తూ వచ్చింది. ఒకవైపు అణచివేతను కొనసాగిస్తూనే, మరోవైపు ఏదో ఒక రాజకీయ ప్రక్రియను సజీవంగా ఉంచడం చేస్తూ వచ్చింది. నిజానికి 2009 కంటె ముందు దీర్ఘకాలం కశ్మీర్‌లో సాపేక్ష శాంతి నెలకొని ఉండింది. ఆ తరువాత సాధారణ ప్రజలను ఆందోళనల్లో భాగస్వాములను చేసే ఎత్తుగడలను మిలిటెంట్‌ సంస్థలు అనుసరించడం మొదలుపెట్టాయి. భద్ర తాదళాలపై రాళ్లు విసిరే ధోరణి ఆ ఎత్తుగడల్లో భాగమే. 2014లో కేంద్రంలో బిజెపి వచ్చి, మరి కొద్దికాలానికి పిడిపితో కలిసి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, కశ్మీర్‌లో పరిస్థితి మారుతూ వచ్చింది. 2016 తరువాత నుంచి వరుస ఘర్షణలు మొదలై, వందలాది మంది పౌరులు, భద్రతాదళాలవారు, మిలిటెంట్లు చనిపోయారు. పౌరజీవనం అతలాకుతలమైంది.

ఎవరితోనైనా చర్చలకు సిద్ధమే అని ప్రకటించడమే తప్ప, అటువంటి ప్రయత్నాలు ఏవీ చిత్తశుద్ధితో జరగలేదు. చర్చల కోసం ప్రత్యేక దూతను నియమించి కూడా చాలా కాలమైనా పురోగతి లేదు. కశ్మీర్‌ పరిస్థితికి మీరు కారణమంటే మీరు కారణమని ఇప్పుడు బిజెపి, పిడిపి నిందించుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని పడగొట్టి, గవర్నర్‌ పాలన విధించిన తరువాత, కశ్మీర్‌లో పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉన్నది. ఒకపక్క పౌర హక్కుల ఉల్లంఘనలు, మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కార అన్వేషణను ప్రతిపాదిస్తున్న బుఖారీ వంటి హత్యలు– అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉదారవాదికి, హితవరులకు స్థానం లేని చోట, కేవలం సైనికచర్యలే మిగులుతాయి. వాటితో పరిష్కారం దొరకకపోగా, సమస్య మరింత జటిలం అవుతుంది.

సరే, కశ్మీర్‌ సమస్యలో ప్రత్యక్షబాధితులు కశ్మీరీయులు. పాత్రధారులు– అక్కడి నాయకులు, కేంద్ర నేతలు, భద్రతాదళాలు, సరిహద్దులకు ఆవలి శక్తులు, స్థానిక మిలిటెంట్లు. దాని దుస్థితిని అట్లాగే కొనసాగిస్తూ, తక్కిన దేశం తన దారిన తాను ప్రయాణిస్తున్నది. కానీ, ఇప్పుడు దేశంలోని యావన్మంది ప్రజలకూ కశ్మీర్‌ రంగస్థలం ఒక రాజకీయవేదిక అవుతుందా? కశ్మీర్‌ను నిలుపుకోవడమే ఎజెండాగా దేశమంతా ఎన్నికలు జరుగుతాయా?. అక్కడి ప్రయోజకత్వాన్ని దేశమంతా ప్రదర్శించి ఫలితాలను పొందాలనుకునేవారుండడం అన్యాయం. అక్కడి దృశ్యాలు చూస్తూ రాజకీయ ప్రాధాన్యాలను నిర్ణయించుకోవలసి రావడం విషాదం. దేశీయ పౌర వ్యవహారాలలో అవినీతిని, నియంతృత్వాన్ని, అసహనాన్ని ఆశ్రయించే రాజకీయ పక్షాలు, అధికారంలో ఉన్నప్పుడు భద్రత, రక్షణ మొదలైన అంశాలలో మాత్రం నిజాయితీగా ఉంటారని జనం ఎందుకు విశ్వసిస్తారో తెలియదు. కానీ విశ్వసిస్తారు. మంచిచెడ్డలను వివరించి చెప్పే నేతలు లేనప్పుడు అట్లాగే విశ్వసిస్తారు. పొరుగువాడిని ప్రేమించాలని, సాటివారిని గౌరవించాలని, అందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని, దేశమంటే మట్టి కాదని మనుషులని – విశ్వసించి ఆచరించే రాజకీయాలు క్రియాశీలంగానూ ప్రభావయుతంగానూ ఉంటే, పాలనలో విఫలమైన వాడు, దేశభక్తి ముసుగువేసుకుని సఫలం కాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *