మేడారం జాతరకోసం పోలీసుల ప్రత్యేక మొబైల్ ఆప్

ఈ నెల 31 న ప్రారంభం కానున్న తెలంగాణ కుంభమేళా “మేడారం జాతర” కి పోలీస్ డిపార్టుమెంటు భక్తుల భద్రత మరియు సౌలభ్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక మొబైల్ ఆప్ ను రూపొందించారు. దీని ద్వారా మేడారం వచ్చే భక్తులకు తెలియవలసిన వివరాలు, ప్రయాణం, సూచనలు వంటి అంశాలు ఉంచారు. మొట్టమొదటి సారిగా అందరికి అర్థం అయ్యే విధంగా ఈ ఆప్ *తెలుగు మరియు ఇంగ్లీష్ బాషలలో* సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ అప్ లోని అంశాలు

మేడారం జాతర యొక్క విశిష్టత, చరిత్ర, జాతర యొక్క కార్యక్రమ సరళి, తేదీలు, రోజువారీ కార్యక్రమాల వివరాలతో పాటు, జాతర జరిగే 4 రోజులలో ఉండే రద్దీ దృశ్యా ప్రయాణికులకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి స్వంత లేదా ప్రైవేట్ వాహనాలకు, ఆర్టీసీ బస్సులకు వేరు వేరు మార్గాలు అలాగే రావడానికి, తిరిగి వెళ్ళడానికి వేరు వేరు మార్గాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి స్వంత లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా వచ్చువారు ఏ ఏ మార్గాల ద్వారా రావచ్చు, ఎక్కడి నుండి ఎంత దూరం ఎక్కడెక్కడ దారి మల్లింపులు ఉంటాయి, ఏ మార్గాల ద్వారా వచ్చే వారికీ ఏ పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉంటాయి, ఏ మార్గం ద్వారా వచ్చిన వారు తిరిగి ఏ మార్గం ద్వారా తమ గమ్య స్థానం చేరుకోవచ్చు వంటి అంశాలను, దారిలో పాటించవలసిన సూచనలను, మ్యాప్ లు మరియు ప్రస్తుత స్థానం నుండి ప్రత్యక్ష గూగుల్ మ్యాప్ ద్వారా మేడారం చేరుకోవడానికి దారి సూచనలతో పాటుగా ఉంచారు. అలాగే మేడారం చుట్టుప్రక్కల ఉన్న 30కి పైగా పార్కింగ్ స్థలాలను భూ ఉపరితల అనుసంధానం చేసి (జియో ట్యాగ్గింగ్) ఆప్ వాడే వారు తమ ఉన్న స్థలం నుండి అక్కడికి గూగుల్ మ్యాప్ ద్వారా చేరుకునే విధంగా సూచనలను అందించడం, పార్కింగ్ సామర్థ్యం, పార్కింగ్ స్థలం విస్తీర్ణత, ప్రస్తుత పార్కింగ్ యొక్క లభ్యత స్థితి వంటి అంశాలు, ఆ పార్కింగ్ స్థలం నుండి అమ్మవారి గద్దెలకు సుమారు దూరం, పార్కింగ్ స్థలాల నుండి ఆర్టీసీ వారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సదుపాయం నుండి సుమారు దూరం వంటి సమగ్ర సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే ఆర్టీసీ బస్సుల ద్వారా, రైలు మార్గాల ద్వారా వచ్చే మార్గాలు, తగిన సమాచారం ఉంది. భక్తులు ముఖ్యముగా తెలుసుకోవలసిన జాతర ప్రదేశాలైన జంపన్న వాగు, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం, అమ్మవారి గద్దెల దర్శనం క్యూ లైన్లు వివరాలు ఉన్నాయి. అలాగే తప్పి పోయే వారి సహాయార్థం ఈ సారి ప్రత్యేకంగా సహాయ, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి వారి ఫోటోలు, వివరాలు తెలపడానికి అతిపెద్ద తెరలను అందరు భక్తులకు కనబడే విధంగా పలు ప్రదేశాలలో ఏర్పరిచి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. అటువంటి సహాయ కేంద్రాల వివరాలు, అదే విధంగా ఎవరైనా తమ వారు తప్పి పోయినా లేదా తప్పి పోయినవారు కనిపించినా, ఈ ఆప్ ద్వారా ఫోటో మరియు వారి ప్రదేశం వివరాలతో సమాచారం అందించవచ్చు. ఇవే కాకుండా భక్తులు ఏవైనా ఇబ్బందులు లేదా సంఘటనలు ఎదురైతే వాటిని కూడా పోలీసువారికి ఈ ఆప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. జాతర ప్రాముఖ్యత మరియు రద్దీ దృష్యా పౌరులు ఎటువంటి జాగ్రత్తలు ట్రాఫిక్ పరంగా, మరియు భద్రత పరంగా తీసుకోవాలి, సూచనలు, పాటించవలసిన నియమాలు సవివరంగా ఇవ్వబడినాయి. ఒక్కసారి ఈ ఆప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అంతర్జాలం (ఇంటర్నెట్) సదుపాయం లేకపోయినా వీలైనంత ఎక్కువ సమాచారాన్ని చూడగలిగేలా ఈ ఆప్ ను రూపొందించారు. మేడారం ప్రవేశం, నిష్క్రమణ చుట్టుప్రక్కల ప్రదేశాల మార్గాలు, రహదారులు సూచించే మార్గ సూచిక మ్యాప్, అత్యవసర సమాచారం, చేయవలసినవి, చేయకూడనివి, సలహాలు, సూచనలు అందించడం, ఇతరులకు పంచుకోవడం వంటి సదుపాయాలతో పాటు, ఎప్పటికప్పుడు పోలీసులు పౌరులకు నేరుగా సమాచారం అందించడానికి వీలుగా ప్రకటనలు శీర్షిక కూడా చేర్చబడినది. ఈ ఆప్ ను హైదరాబాద్ కు చెందిన విమాక్స్ ఈ-సొల్యూషన్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది.

ఈ ఆప్ ను పొందగోరి వారు గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి Guide to Medaram 2018- Police official అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *